Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీని కోరుతున్నాం: కేఏ పాల్
- మా బీ ఫారాలు దొంగిలించారు
- అందుకే అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయలేకపోయాం
- కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరింత సందడి చేస్తున్నారు. తమ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు నామినేషన్ వేయాలని భావిస్తే, చివరికి 75 స్థానాల్లో మాత్రమే వేయగలిగామని పాల్ విచారం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల కోసం కేటాయించిన బీ ఫారాలు, స్టాంపులను ఎవరో దొంగిలించారని, అందుకే అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయలేకపోయామని వివరణ ఇచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తున్నామని కేఏ పాల్ వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ల తిరస్కరణకు గురైనవారు తనకు సమాచారం అందివ్వాలని, ఆ విషయాన్ని తాను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.