Andhra Pradesh: ఈసీ ఆదేశాలు బేఖాతరు చేశారు.. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయలేదే?: వైసీపీ నేత బొత్స
- ముగ్గురిని బదిలీ చేస్తూ నిన్న జీవో వెలువడింది
- కొత్తగా మళ్లీ రెండు జీవోలు తెరపైకొచ్చాయి
- ఆ జీవోలో వెంకటేశ్వరరావు పేరు తప్పించారు
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి రిలీవ్ చేయాలన్న ఈసీ ఆదేశాలను చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈసీ ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావు సహా మరో ఇద్దరు అధికారులను రిలీవ్ చేస్తూ నిన్న జీవో నెంబర్ 716 వెలువడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ జీవో వెలువడి 24 గంటలు గడవకముందే, తెరపైకి కొత్తగా రెండు జీవోలు 720, 721 వచ్చాయని అన్నారు. జీవో 716 ను రద్దు చేస్తూ జీవో 720 ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందని, కొత్త జీవోలో ఏబీ వెంకటేశ్వరరావు పేరును తప్పించారని ఆరోపించారు. ఈ జీవోలో కేవలం, కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తున్నట్టు ఉందని అన్నారు. ఈసీ పరిధిలోకి ఎవరెవరు వస్తారన్న దానిపై జీవో 721 ఉందని, ఇంటెలిజెన్స్ శాఖను ఈసీ పరిధి నుంచి తప్పిస్తూ ఈ జీవో జారీ చేశారని ఆరోపించారు.