YSRCP: రెండేళ్లు జైల్లో ఉండొచ్చిన మీరు ఏమన్నా మహాత్మాగాంధీయా?: జగన్ పై పవన్ విసుర్లు

- జగన్ మాట్లాడితే, నన్ను ‘యాక్టర్’ అంటారు
- మమ్మల్ని ‘టీడీపీ పార్టనర్’ అని విమర్శిస్తారా?
- మిమ్మల్ని ఎవరి పార్టనర్ అనాలి?
వైసీపీ అధినేత జగన్ పై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్ మాట్లాడుతూ, "జగన్ మాట్లాడితే, నన్ను ‘యాక్టర్’ అంటారు. నేను కాదనడం లేదు. మరి, రెండు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిన మీరు మహాత్మాగాంధీయా? మీరు ఏం చేశారు?" అని ప్రశ్నించారు.
"అలాగే జగన్ మాట్లాడితే నన్ను ‘టీడీపీ పార్టనర్’ అంటారు. అసలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరి పార్టనర్ అనాలి? మోదీ పార్టనరా? అమిత్ షా పార్టనరా? టీఆర్ఎస్ పార్టనరా?" అని ప్రశ్నించారు. "ఈ ముగ్గురితో పార్టనర్ అయిన జగన్ మోహన్ రెడ్డికి నేనొకటి చెబుతున్నా, నేను యాక్టర్ నే. అది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను. నేను చదువుకుంది పదో తరగతే. కానీ, నా చదువు ఆపలేదు. పబ్లిక్ పాలసీల గురించి నేను చదువుకుంటూనే ఉన్నా. ఏం తెలియకుండా, అర్థం చేసుకోకుండా రాజకీయాల్లోకి మేము వస్తామా? ఈ తరానికి అండగా ఉండేందుకు వచ్చాను" అని అన్నారు.