Telangana: యాదాద్రి జిల్లాలో 'కొరుకుడు' బాబా లీలలు!
- కొరికితే పిల్లలు పుడతారట
- పంటిగాట్లతో రోగాలు మటుమాయమట
- తెరపైకి కొరుకుడు కొత్త బాబా!
ప్రజల బలహీనతలు, వారి అవసరాలను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకునేవాళ్లు ఎంతో మంది ఉంటారు! నకిలీ బాబాలు కూడా ఈ కోవలోకే వస్తారు. అర్థంపర్థంలేని చేష్టలతో ప్రజలను వంచిస్తూ బాబాలుగా చలామణీ అవుతుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన కొప్పుల రాంరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటివాడే. ఆరో తరగతి వరకు చదివిన రాంరెడ్డి లోకాన్ని అంతకంటే ఎక్కువే చదివాడు. ప్రజల మూర్ఖత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని బాబా అవతారం ఎత్తాడు. అయితే, మిగతా బాబాలతో పోలిక లేకుండా కొరకడం అనే విద్యను తన ప్రత్యేకతగా మలుచుకున్నాడు. ఆడామగా తేడా లేకుండా తన వద్దకు వచ్చిన వాళ్లను ఇష్టంవచ్చినట్టు కొరుకుతుంటాడు.
తాను కొరికితే సంతానం లేనివాళ్లు సంతానం పొందుతారని, మగవాళ్లకు జబ్బులు నయమవుతాయని జనాల్లో ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాడు. మగవాళ్లను కిందపడేసి తొక్కడం, ఆడవాళ్లను ఎక్కడ పడితే అక్కడ కొరకడం వంటి చేష్టలతో జుగుప్సాకరంగా వ్యవహరిస్తుంటాడు. అయితే రాంరెడ్డి వికృత చర్యలను కొందరు వీడియో తీయడంతో అతడి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. దాంతో, పోలీసులు స్పందించి అతడిని అరెస్ట్ చేసి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆడామగా అనే తేడాలేకుండా గ్రామసింహంలాగా తన పంటిగాట్లు రుచిచూపించే ఈ కొరుకుడు బాబా రూ.100 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేస్తాడు. ప్రత్యేక వైద్యం పేరుతో మరికొంత బాదుతాడట!