Jagan: ఈ 20 రోజుల్లో చంద్రబాబు చూపించని సినిమా అంటూ ఉండదు: జగన్ సెటైర్
- మోసాలు చేస్తాడు
- అబద్ధాలు చెబుతాడు
- ఇరవై రోజులు ఓపిక పట్టండి అంటూ పిలుపు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లా తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షోలో జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఇరవై రోజులు వైసీపీ కార్యకర్తలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎన్నికల తేదీ వరకు చంద్రబాబు చెప్పని అబద్ధం ఉంటూ ఉండదు, ఆయన చేయని మోసం అంటూ ఉండదు, ఆయన చూపించని సినిమా అంటూ ఉండదు అంటూ శ్రేణులను అప్రమత్తం చేశారు.
"ఇది ధర్మానికి, అధర్మానికి యుద్ధం. ఈ రోజు మనం యుద్ధం చేసేది చంద్రబాబునాయుడు ఒక్కడితోనే కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన ఇతర చానళ్లన్నంటితో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికల నాటికి ప్రతి ఊరికి మూటలు మూటలు డబ్బులు పంపించి ప్రతి ఒక్కరికీ రూ.3000 చేతుల్లో పెడతాడు. చంద్రబాబు కుతంత్రాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దు" అంటూ నిప్పులు చెరిగారు.