KA Paul: గందరగోళంగా కేఏ పాల్ నామినేషన్ పత్రాలు.. సగం వివరాలు ఖాళీ!

  • చాలా వరకు వివరాలు వెల్లడించని పాల్
  • తన చేతిలో ఉన్న రూ. 30 వేలు తప్ప ఆస్తులు, అప్పులు లేవన్న పాల్
  • కుల, మత ప్రస్తావన లేకుండా నామినేషన్

కేఏ పాల్‌గా చిరపరిచితుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ ఈ ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో దాదాపు సగభాగం ఖాళీగా కనిపించడం గమనార్హం. చాలా వరకు వివరాలను ఆయన పూర్తిచేయకుండా ఖాళీగా వదిలివేయడం చర్చనీయాంశమైంది.

నామినేషన్ పత్రాలపై ఫొటో కూడా అతికించని పాల్.. తానెంత వరకు చదువుకున్నదీ వెల్లడించలేదు. ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీలను మాత్రం పేర్కొన్నారు. తన అసలు పేరు కిలారి ఆనంద్ అని అందులో పేర్కొన్న పాల్ విశాఖపట్టణంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ఇచ్చారు. తన వయసు 55 ఏళ్లు అని పేర్కొన్నారు. కులం, మతం వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు, తన నామినేషన్‌ను ప్రపోజ్ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా పేర్కొనలేదు. పాన్ కార్డు నంబరు ఇచ్చినప్పటికీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు.

తనపై ఒంగోలులో ఓ కేసు నమోదైందని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న పాల్.. క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఫెడరల్ బ్యాంకు ఖాతా వివరాలను పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న రూ. 30 వేలు తప్ప తనకు ఎటువంటి ఆస్తులు, అప్పులు లేవని పేర్కొనడం గమనార్హం.

More Telugu News