Telugudesam: 31 కేసులున్న జగన్ కు ఓటేస్తే క్రిమినల్ రాజ్యం వస్తుంది: యనమల విమర్శలు
- కేసీఆర్, మోదీలతో జగన్ చేయి కలిపారు
- రాష్ట్ర నాశనాన్ని కోరుకున్నారు
- తన అవినీతి నిజమే అని నిరూపించుకున్నారు
ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ కు ఓటేస్తే వినాశనమేనని అన్నారు. 31 కేసులున్న జగన్ కు ఓటేస్తే రాష్ట్రంలో క్రిమినల్ రాజ్యం వస్తుందని, టీడీపీకి ఓటేస్తే రామరాజ్యం వస్తుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిన కేసీఆర్, ఆంధ్రా నాశనాన్ని చూడాలనుకుంటున్న మోదీతో జగన్ చేతులు కలిపారని యనమల మండిపడ్డారు.
ఎన్నికల అఫిడవిట్ లో జగన్ రూ.510 కోట్ల ఆస్తిని చూపడం ద్వారా తన అవినీతిని తానే నిరూపించుకున్నారని విమర్శించిన ఆయన, గతంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన జగన్ కు వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ప్రజాసమస్యలపై పోరాడకుండా పార్లమెంట్, అసెంబ్లీ నుంచి పరారైన జగన్ బృందానికి ప్రజలు ఓటెందుకు వేయాలని యనమల ప్రశ్నించారు.