YSRCP: సైబరాబాద్ పోలీసులకు వివేకా కుమార్తె సునీతారెడ్డి ఫిర్యాదు
- తండ్రి మృతిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు
- ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ లో అసత్య కథనాలు
- పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలసిన సునీత
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కొన్నిరోజుల క్రితం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మరణం ఎన్నో అనుమానాలకు దారితీసిన నేపథ్యంలో, తన తండ్రి చావును రాజకీయం చేయొద్దంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఇప్పటికే అన్ని పార్టీలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.
తాజాగా, తన తండ్రి విషయమై సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. ఆమె శనివారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వచ్చారు. తన తండ్రి మృతిపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న నిందితులను చట్టప్రకారం శిక్షించాలని సునీతారెడ్డి తన ఫిర్యాదులో కోరారు.
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆరోపించారు. ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా తన తండ్రి గురించి అసత్య కథనాలు కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.