Tollywood: వైజాగ్ లో 'చీకటిగదిలో చితక్కొట్టుడు' సినిమా థియేటర్ ను ముట్టడించిన మహిళలు
- ప్రదర్శన నిలిపివేతకు డిమాండ్
- గాజువాకలో మహిళా సంఘాల నిరసన
- లక్ష్మీకాంత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
ఇటీవల తెలుగులో పెద్దలకు మాత్రమే సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. ఈ కోవలో విడుదలైన చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఈ సినిమా ట్రైలర్ నుంచే సృష్టించిన ప్రకంపనలు అన్నీఇన్నీ కావు. సినీ బూతుకు పరాకాష్టలా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్ నుంచి పోస్టర్ల వరకు అన్నీ అభ్యంతరకంగా ఉన్నాయంటూ ఎక్కడో ఒక చోట నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.
తాజాగా, వైజాగ్ గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా హాల్లో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఐద్వా నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలు లక్ష్మీకాంత్ థియేటర్ ను చుట్టుముట్టడంతోపాటు పోస్టర్లు చించివేసి, నినాదాలు చేశారు. యువతను భ్రష్టుపట్టించే ఇలాంటి సినిమాలను ప్రదర్శించడం నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ మహిళా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.