: మీ మెదడుకు గ్రామర్ తెలుసు...!
గ్రామర్ మీకు తెలియకున్నా మీ మెదడుకు తెలుస్తుంది, అది గ్రామర్ మిస్టేక్స్‌ని గుర్తించేస్తుందట...! ఈ విషయాన్ని అమెరికాలోని ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన నాడీ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం ద్వారా నిర్ధారించారు. వీరి ప్రయోగంలో కొందరు వాలంటీర్ల మెదడు చర్యలను ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ ద్వారా నమోదు చేశారు. మెదడులోని ఈవెంట్ రిలేటెడ్ పొటెన్షియల్ అనే సంకేతంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ ద్వారా ఏదైనా ఒక సంఘటన జరిగినపుడు మెదడులోని విద్యుత్ చర్యల్లో జరిగే మార్పులను గ్రహించడానికి వీలవుతుంది. అయితే ఈ ప్రయోగంలో సంఘటన అనేది చిన్నపాటి వాక్యాల రూపంలో ప్రదర్శించడం. ఈ వాక్యాలను ప్రదర్శించినపుడు అందులోని వ్యాకరణ దోషాలను గురించి వారికి తెలియకపోయినా వారి మెదళ్లు మాత్రం ప్రతికూల స్పందన ద్వారా గుర్తించేశాయట.
ఈ ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్లంతా ఆంగ్లం మాట్లాడే 18 నుండి 30 ఏళ్లలోపు వ్యక్తులే. ఈ ప్రయోగంలో వీరికి 280 వాక్యాలను ప్రదర్శించారు. ఈ వాక్యాలలోని వ్యాకరణ లోపాలను వారికన్నా వారి మెదడులు గుర్తించినట్టు ఈ పరిశోధనలో తేలిందట. ఈకన్నా మీ మెదడు ముందుగా వ్యాకరణ దోషాలను గుర్తింస్తుందని, దీనికి అనుగుణంగా స్పందించేలా మెదడులో ఒక వ్యవస్థ ఉంటుందని ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన లారా బ్యాటరింక్ చెబుతున్నారు.