Chandrababu: రేపు అందరూ పేపర్లు చదవండి.. జగన్ పై ఎన్ని కేసులున్నాయో అన్నీ బయటికొస్తాయి: చంద్రబాబు
- అఫిడవిట్ లో ప్రతి కేసు పేర్కొనాల్సిందే
- మీ పిల్లల్ని వైసీపీలోకి పంపొద్దు
- కేసుల్లో ఇరుక్కునేలా చేస్తారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ జిల్లా పెందుర్తి సబ్బవరం జంక్షన్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్ షోలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రధానంగా విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు అందరూ పేపర్లు చదవాలని, జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో బయటికొస్తాయని తెలిపారు.
ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో తనపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి ఒక్కటీ వెల్లడించాల్సిందేనని అన్నారు. మీ పిల్లల్ని వైసీపీలోకి పంపొద్దని, కేసుల్లో ఇరుక్కునేలా చేసి జైలుకు పంపించే మహానాయకుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. పన్నులు కడుతున్నాం కాబట్టి తాము కేంద్రాన్ని గట్టిగా నిలదీయగలమని, కానీ కోడికత్తి పార్టీ అలా అడగలేదని ఎద్దేవా చేశారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసులే అందుకు కారణమని విమర్శించారు.