Tollywood: మా అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణస్వీకారం... ప్రత్యేక గీతం విడుదల

  • బాధ్యతలు అప్పగించిన శివాజీరాజా
  • ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలంటూ సూచన
  • మంచిపేరు తెచ్చుకోవాలంటూ శుభాకాంక్షలు

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా నరేష్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. గత కొన్నిరోజులుగా నరేష్ కు, 'మా' తాజా మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ప్రమాణస్వీకారం సందర్భంగా విభేదాలన్నీ పక్కనబెట్టి ఇరువురు సంయమనం పాటించారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా మాట్లాడుతూ, 'మా' కొత్త కార్యవర్గం చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు.

తమకంటే ముందు 'మా' కార్యవర్గంలో పనిచేసిన వాళ్లు తమకు ఒక్కటే చెప్పారని, తాము కష్టపడి తీసుకొచ్చిన నిధుల నుంచి ఒక్క పైసా కూడా జారిపోనివ్వకుండా, కొత్త నిధులు తీసుకువచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నారని, వాళ్లు చెప్పినట్టే తాము చేశామని శివాజీరాజా వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన నరేష్ కార్యవర్గం కూడా అదే పంథా అనుసరించాలని సూచించారు. కాగా,  నరేష్ 'మా' కోసం స్పెషల్ సాంగ్ ను  రూపొందించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా ఈ పాటను కృష్ణ-విజయనిర్మల, కృష్ణంరాజు-శ్యామలాదేవి దంపతుల చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కోట శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. 'మా' కార్యవర్గంలో ఇతర సభ్యులుగా జీవిత, శివబాలాజీ, రాజీవ్ కనకాల కూడా బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News