Telugudesam: కుప్పంలో చంద్రబాబు తరఫున నామినేషన్ వేయనున్న భార్య భువనేశ్వరి
- కుప్పంలో టీడీపీ శ్రేణుల సందడి
- న్యాయమూర్తి ఎదుట పత్రాలపై సంతకం చేసిన సీఎం
- గతంలో కార్యకర్తలతో నామినేషన్ వేయించిన టీడీపీ అధినేత
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన తరఫున అర్ధాంగి భువనేశ్వరి కుప్పంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన అసెంబ్లీ బరిలో దిగడం ఇది ఏడవ పర్యాయం. గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యకర్తలే చంద్రబాబు తరఫున నామినేషన్ వేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో కుప్పంకు వచ్చే వీల్లేక విజయవాడలోనే సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరై నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇప్పుడా పత్రాలనే భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల అధికారులకు అందజేయనున్నారు.