Chandrababu: పీవీపీ క్యాజువల్ గా అన్న మాటను రాద్ధాంతం చేస్తున్నారేంటి?: అసహనం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
- చంద్రబాబే హోదా అంశాన్ని ఎప్పుడో వదిలేశారు
- సీఎంనే మార్చేయాలి
- మండిపడిన వైఎస్సార్సీపీ నేత
ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్ సబ్జెక్ట్ అంటూ వైసీపీలో కొత్తగా చేరిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఏ నిమిషాన అన్నాడో కానీ రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం చంద్రబాబు నుంచి సీపీఐ రామకృష్ణ వరకు పీవీపీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. పీవీపీ రాజకీయాలకు పనికిరాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పీవీపీకి సొంత పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ వ్యూహకర్తల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో స్పందించారు.
పీవీపీ క్యాజువల్ గా అన్న మాటను పట్టుకుని టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అభ్యర్థినే మార్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారని, అసలు రాష్ట్రానికి హోదాయే వద్దన్న చంద్రబాబును ఎప్పుడో మార్చాల్సిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించినా ఏంచేశారో చెప్పుకోలేక జగన్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో టీడీపీ నేతలు డబ్బులు వేస్తూ ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సజ్జల ఆరోపణలు గుప్పించారు. డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.