YSRCP: జగన్ కు చిత్తశుద్ధి ఉంటే విజయవాడ పార్లమెంటు అభ్యర్థిని మార్చాలి: సీపీఐ రామకృష్ణ డిమాండ్
- పీవీపీ వ్యాఖ్యలను తప్పుబట్టిన వామపక్ష నేత
- రాజకీయాలకు అనర్హుడంటూ మండిపాటు
- ప్రజలు తిరస్కరించాలంటూ పిలుపు
ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్ సబ్జెక్ట్ అంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పీవీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, పీవీపీ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితుల పట్ల ఏమాత్రం అవగాహనలేని పీవీపీ రాజకీయాలకు అనర్హుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని మార్చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం తదితర అంశాలపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తిగా పీవీపీ రాజకీయాలకు పనికిరాడని, అతడి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ ప్రజలందరూ తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరిన పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీకి పార్టీ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో ప్రత్యేక హోదాపై పీవీపీ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదా అంశం వైఎస్సార్సీపీ నేతలకు బోరింగ్ సబ్జెక్ట్ గా కనిపిస్తోందంటే ఇలాంటి నాయకులను ఎన్నికల్లో గెలిపించడంపై అందరూ ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు.