Tollywood: నరేష్ చిత్తుగా తాగి ఫ్లయిట్ మిస్సయితే మరో విమానంలో పంపించారు: శివాజీరాజా
- ముదురుతున్న 'మా' వివాదాలు
- డైరీ యాడ్స్ తో వచ్చిన మిగతా డబ్బులెక్కడ?
- నరేష్ ను నిలదీసిన శివాజీరాజా
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నరేష్ కొత్త అధ్యక్షుడిగా, హీరో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 'మా' నూతన కార్యవర్గం మార్చి 22న ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, కొత్త అధ్యక్షుడు నరేష్, శివాజీరాజా మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. తమను ప్రమాణస్వీకారం చేయనివ్వకుండా శివాజీరాజా అడ్డుకుంటున్నాడని నరేష్ ఆరోపించగా, 'మా' డైరీకి యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.7.2 లక్షలు ఏమయ్యాయో చెప్పిన తర్వాతే నరేష్ పదవీప్రమాణం చేయాలంటున్నారు శివాజీరాజా. తాజాగా, శివాజీరాజా మీడియా ముందుకు వచ్చి నరేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో నరేష్ 'మా' జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు.
ఓసారి తాను, పరుచూరి, నరేష్ మలేసియా వెళ్లిన సమయంలో ఏం జరిగిందో శివాజీరాజా వెల్లడించారు. తాను, పరుచూరి సాధారణ డబుల్ బెడ్ రూమ్ లో బస చేస్తే, నరేష్ లగ్జరీ సూట్ లో బస చేశాడని చెప్పారు. అంతేకాకుండా, బాగా తాగేసి ఫ్లయిట్ మిస్సయితే మరో విమానంలో టికెట్ బుక్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రతిసారి 'మా' డైరీ రూపొందించే బాధ్యతను తాను తీసుకునేవాడ్నని, కానీ, నరేష్ వచ్చి తాను చేస్తానని అనడంతో ఈ సంవత్సరం అతనికే ఇచ్చానని తెలిపారు.
అయితే, 'మా డైరీలో' వాణిజ్య ప్రకటనల ద్వారా 14.2 లక్షల ఆదాయం వస్తే, అందులో రూ.7.2 లక్షలు గల్లంతైనట్టు తెలిసిందని శివాజీరాజా అన్నారు. అకౌంట్ వెరిఫికేషన్ చేస్తే అందులో రూ.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతా డబ్బులు ఏమయ్యాయో చెప్పాల్సిన బాధ్యత నరేష్ పైనే ఉందన్నారు. ఆ లెక్కలు చెప్పిన తర్వాతే నరేష్ మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయాలని శివాజీరాజా పేర్కొన్నారు.