YSRCP: ఇంటి తలుపు తీసినవాడే వివేకా ప్రాణం తీశాడు: పరమేశ్వర్ రెడ్డి

  • ఇంట్లో వారి హస్తం ఉంది
  • వివేకా ఎదుగుదల చూడలేకపోయారు
  • డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడు

వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడంటూ రోజుకొకరిపై అనుమానాలు మళ్లుతున్నాయి. తాజాగా, వివేకా సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డిపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే, తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డి వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ రోజు వివేకా ఇంటి తలుపు తీసినవాళ్లే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య ఇంట్లో వాళ్ల పనే అయ్యుంటుందని, లేకపోతే, ఇంటి తలుపు ఎవరు తీస్తారని ప్రశ్నించారు. ఇంటి దొంగలే వివేకా ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ సీఎం అయితే వివేకా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవాడని, కానీ ఆయన ఎదుగుదల చూడలేనివాళ్లే ఆయన్ను హత్యచేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, తాను అనారోగ్యంతో బాధపడుతూ ఆయన భౌతికకాయాన్ని చూడడానికి వెళ్లకపోవడం వల్లే తనపై అనుమానాలు వచ్చాయని భావిస్తున్నట్టు పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. వైఎస్ కుటుంబానికి ప్రాణాలు ఇచ్చేవాడ్నే తప్ప ప్రాణాలు తీసేవాడ్ని కాదని మరోసారి స్పష్టం చేశారు. ఇక, వివేకా డ్రైవర్ ప్రసాద్ పై ఆరోపణలు రావడం బాధాకరం అని వ్యాఖ్యానించిన పరమేశ్వర్ రెడ్డి, ప్రసాద్ ఎంతో మంచివాడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News