Chandrababu: ఇడుగో పులి... అంటూ శిద్ధా రాఘవరావును చూపించిన చంద్రబాబు
- ఎంపీగా పోటీచేస్తున్న ఏపీ మంత్రి
- అభినందించిన సీఎం
- పార్టీ మారిన నేత అంటూ మాగుంటకు చురకలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వరుసగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోమవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిద్ధా రాఘవరావును ఈసారి ఎన్నికల్లో పార్టీ ఎంపీగా పోటీచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు తన ప్రసంగం ఆరంభంలోనే శిద్ధాను చూపిస్తూ ఇడుగో పులి అంటూ అభినందించారు. అందుకు కారణమేంటో కూడా చెబుతూ పార్టీ మారిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "నిన్నటి వరకు మనకు ఓ మాజీ ఎంపీ ఉండేవాడు. ఆయన చివరి నిమిషంలో మన పార్టీ నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఇక్కడో పులి ఉన్నాడు... ఆయనే శిద్ధా రాఘవరావు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆ మాజీ ఎంపీని ధైర్యంగా ఢీకొట్టాలని కోరాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఢీకొడతానంటూ ముందుకొచ్చారు శిద్ధా రాఘవరావు. పార్టీని చివరి నిమిషంలో మోసం చేసినవారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.