Chandrababu: ఊరందరిదీ ఒకదారి, వీళ్లిద్దరిదీ మరోదారి: కేసీఆర్, జగన్ లపై చంద్రబాబు నిప్పులు
- ఫెడరల్ ఫ్రంట్ లో ఉన్నది ఈ ఇద్దరే
- వీళ్లకి మోదీ కాపలాదారు
- ఒంగోలు సభలో సీఎం విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఒంగోలులో ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, జగన్ లపై ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎంతో దుర్మార్గంగా ఉన్నాడని, టీడీపీకి ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఆఫీసుకు తన మనుషులను పంపి ఏపీ ప్రజల డేటా అంతా తీసుకెళ్లి వైసీపీ చేతుల్లో పెట్టాడని ఆరోపించారు. ఇలాంటి వాళ్లకు ప్రధాని మోదీ కాపలాదారు అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్నారని, అందులో ఉన్నది ఇద్దరే ఇద్దరని, ఒకరు కేసీఆర్, మరొకరు జగన్ అని అన్నారు. అందరిదీ ఒకదారి అయితే వీళ్లిద్దరిదీ మరొకదారి అని విమర్శించారు. పోలవరం ఆంధ్రుల జీవనాడి అని, పోలవరం వస్తే కష్టాలు తీరతాయని తాము భావిస్తుంటే కేసీఆర్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. మోదీని, జగన్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ నాలుగైదు సీట్లు సంపాదించుకుని తెలుగుజాతిని అమ్మేస్తాడంటూ మండిపడ్డారు.
"ఎవరీ కేసీఆర్? ఏం చేయగలడు? అమాంతంగా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? ఎవరిచ్చారు అతనికి రాజకీయ జీవితం? నా వద్ద పనిచేసిన నీకే అంత టెక్కుంటే నాకెంత టెక్కుండాలి? నామీదే నీ రుబాబులా? ఆ రోజు తెలుగుజాతి కోసం హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను. రాష్ట్ర విభజన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో కట్టుబట్టలతో అమరావతి వచ్చేశాం. ఎవరు అడ్డొచ్చినా రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపిస్తా. మా నాయకులను లోబరుచుకుని పబ్బం గడుపుకోవాలనుకుంటే నీ ఆటలు సాగవని మరోసారి హెచ్చరిస్తున్నా" అంటూ ప్రసంగించారు.
అంతకుముందు, జగన్ పైనా తీవ్రస్థాయిలో గళం విప్పారు. హత్యచేసినవాళ్లు ముద్దాయిలేనని, సాక్ష్యాలు తారుమారు చేసినవాళ్లు నేరస్తులేనని పరోక్షంగా వైఎస్ కుటుంబీకులపై వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో పోలీసులు నిష్పాక్షింగా విచారణ జరిపి దోషులు ఎంత పెద్దవాళ్లయినా, ఏ స్థానంలో ఉన్నా చట్టం ముందుకు తీసుకురావాలని అన్నారు.