YSRCP: తిరుపతి ఆసుపత్రిలో వివేకా హత్య కేసు అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి!
- నాకే సంబంధంలేదు
- అది ఇంటి దొంగల పనే
- స్పష్టం చేసిన పరమేశ్వర్ రెడ్డి
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల హోరు నడుమ జరిగిన ఈ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. అయితే, వివేకా హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండాపోయిన పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దర్శనమివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య గురించి అతడిని మీడియా ప్రశ్నించగా... తనకు అనారోగ్యంగా ఉండడంతో మొదట కడప సన్ షైన్ ఆసుపత్రిలో చేరానని వెల్లడించాడు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ 3 రోజులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం తాను తిరుపతి వచ్చానని వెల్లడించాడు.
వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని చెప్పిన పరమేశ్వర్ రెడ్డి.... పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి భార్య కూడా మీడియాతో మాట్లాడుతూ, తన భర్త కనీసం మంచం దిగి నడవలేని స్థితిలో ఉంటే అన్యాయంగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. హత్యచేసిన వాళ్లను పట్టుకోకుండా తమలాంటి వారిపై నిందలు మోపుతున్నారని బాధను వ్యక్తం చేశారు.
కాగా, పరమేశ్వర్ రెడ్డికి కడప సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యం చేసిన డాక్టర్... పరమేశ్వర్ రెడ్డిని కర్నూలులో చికిత్స చేయించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే పరమేశ్వర్ రెడ్డి కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చి సంకల్ప ఆసుపత్రిలో చేరడం గమనార్హం. పరమేశ్వర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా సింహాద్రిపురం. వైఎస్ వివేకాకు సన్నిహితుడిగా పేరుపొందాడు. పరమేశ్వర్ రెడ్డి గతచరిత్ర చూస్తే అతడిపై హత్యకేసులు ఉన్నట్టు సమాచారం.