Chandrababu: తప్పుడు సాక్ష్యాలు సృష్టించే వర్శిటీలో జగన్ చదివారు: చంద్రబాబు సెటైర్
- వీళ్లు బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు
- కార్యకర్తలే కొండంతం అండ
- జగన్, మోదీ, కేసీఆర్ లను టార్గెట్ చేసిన సీఎం
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు జెట్ స్పీడ్ తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వయసులోనూ చెక్కుచెదరని స్టామినాతో ఆయన వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో సైతం ఒకే తీవ్రతతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ తనను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని, విభజన చట్టం గురించి అడిగితే మోదీకి కోపమొస్తుందని, విద్యుత్ బకాయిల గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ ఎదురుదాడికి దిగుతారని చంద్రబాబు ఆరోపించారు. అయితే తనకు కార్యకర్తలే కొండంత అండ అని పేర్కొన్నారు.
పోలవరం పూర్తిచేసి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికీ నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పోలవరం ప్రాజక్టుకు కేసీఆర్ ఎందుకు అడ్డుపడుతున్నారంటూ నిలదీశారు. విభజన హామీల గురించి గట్టిగా అడిగితే మోదీ ఐటీ దాడులు చేయిస్తారని, ఇలాంటి వాళ్లకు జగన్ తోడయ్యాడని విమర్శించారు. తనపై ఉన్న కేసుల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను తాకట్టు పెడతారని అన్నారు.
పులివెందుల మార్కు రాజకీయాలు మనకు అవసరమా? హత్యారాజకీయాలు చేసే పార్టీ మనకు అవసరమా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు, హత్య జరిగిన తర్వాత ఆధారాలు తారుమారు చేసేవాళ్లను ఏమనాలంటూ సభికులను అడిగారు. జగన్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించే వర్శిటీలో చదువుకున్నారంటూ ఎద్దేవా చేశారు.