Hyderabad: 'టెస్ట్ డ్రైవ్' దొంగను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
- ఓఎల్ఎక్స్ లో పోస్టు చేసే వాహనాలపై కన్ను
- నడిపి చూస్తానంటూ ఉడాయింపు
- ఎట్టకేలకు పోలీసులకు దొరికిన వైనం
హైదరాబాద్ పోలీసులు టెస్ట్ డ్రైవ్ పేరుతో వాహనాలను ఎత్తుకెళుతున్న ఓ దొంగను పట్టుకున్నారు. అతడి పేరు జి.నగేష్. వయసు 21 సంవత్సరాలు. కొత్తపల్లి ప్రాంతానికి చెందిన నగేష్ ఓ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే విలాసాల బాటపట్టి కొత్తరకం చోరీలకు తెరలేపాడు. ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ ను లక్ష్యంగా చేసుకుని అందులో పాత వాహనాలు అమ్ముతామంటూ కొందరు ఇచ్చే ప్రకటనను చూసి నగేష్ ఫోన్లు చేసేవాడు.
ఆయా వాహనాల యజమానుల వద్దకు వెళ్లి ఓసారి టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ నమ్మబలికేవాడు. వాళ్లు నిజమని నమ్మి వాహనం అప్పగించడమే ఆలస్యం... రివ్వుమంటూ ఉడాయించేవాడు. ఆ విధంగా ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు పల్సర్ బైకులు ఎత్తుకెళ్లాడు. అంతేకాదు, నగేష్ కొన్ని స్మార్ట్ ఫోన్లను కూడా ఇదే తరహాలో యజమానులను ఏమార్చి చోరీ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గత కొంతకాలంగా షాద్ నగర్ పరిధిలో టెస్ట్ డ్రైవ్ తరహా చోరీలు ఎక్కువ కావడంతో పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఓ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తుండగా నగేష్ ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. శనివారం అతడిని కేశంపేట ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెండు బైకులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఖరీదైన ఫోన్లను అమ్మేసి ఆ డబ్బుతో జల్సా చేసినట్టు గుర్తించారు.