: సైనికుడి గుండెను పీక్కుతిన్న తిరుగుబాటుదారుడు!
ఇంతకంటే అమానుష చర్య మరోటి ఉండదేమో! సిరియా ప్రస్తుతం అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అక్కడ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ దళాలకు తిరుగుబాటుదారులకు మధ్య నిత్యం పోరాటాగ్నిజ్వాలలు రగులుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఓ తిరుగుబాటుదారుడు మరణించిన సైనికుడి గుండెను పీక్కుతింటున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో సంచలనం రేపింది. ఆ వీడియోలో అబు సక్కర్ అనే తిరుగుబాటు కమాండర్.. మృత సైనికుడి ఛాతీని కత్తితో పెళ్ళగించి, గుండెను బయటికి లాగి, పళ్ళతో చీల్చుకుని తింటున్న దృశ్యాలు అత్యంత భీతిగొలిపేలా ఉన్నాయి.
ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసలు పెల్లుబికాయి. అమెరికాలోని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అబు సక్కర్ చర్యను తీవ్రంగా గర్హించింది. ఇది తప్పకుండా యుద్ధ నేరమేనని పేర్కొంది. సిరియా ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.