Hyderabad: న్యూజిలాండ్ కాల్పుల్లో హైదరాబాద్ టెక్కీ మృతి

  • తీవ్ర విషాదంలో కుటుంబం
  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
  • మరో హైదరాబాదీకి గాయాలు

న్యూజిలాండ్ నరమేధంలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా తెలిసింది. శుక్రవారం క్రైస్ట్ చర్చ్ నగరంలో మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లింలపై బ్రెంటన్ హ్యారిసన్ టరాంట్ అనే ఆస్ట్రేలియా జాతీయుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో  ఫర్హాజ్ అహ్సాన్ (31) అనే ఐటీ నిపుణుడు కూడా ప్రాణాలు విడిచాడు. ఫర్హాజ్ ను మొదట గల్లంతైన వ్యక్తుల జాబితాలో పేర్కొన్న న్యూజిలాండ్ అధికారులు ఆ తర్వాత మృతి చెందినట్టు ప్రకటించారు.

క్రైస్ట్ చర్చ్ మసీదుల్లో కాల్పుల ఘటన గురించి మీడియాలో చూసిన ఫర్హాజ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన తమ్ముడు తప్పించుకుని ఉంటాడని భావించామని, కానీ విషాదకరమైన వార్త వినాల్సి వచ్చిందని ఫర్హాజ్ తండ్రి మహ్మద్ సయీదుద్దీన్ తెలిపాడు. కాగా, హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ ఈ కాల్పుల ఘటనలో గాయాలతో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం జహంగీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. న్యూజిలాండ్ కాల్పుల ఘటనలో మొత్తం 49 మంది మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News