Chandrababu: ఇంట్లో వాళ్లు చంపితేనే ఆధారాలు మాయం చేసే ప్రయత్నాలు జరుగుతాయి: చంద్రబాబు విశ్లేషణ
- ఉదయం లేని లేఖ సాయంత్రానికి ఎలా వచ్చింది?
- వివేకా మృతిని రాజకీయం చేస్తున్నారు
- నాపై, లోకేష్ పై ఆరోపణలు చేయడం దారుణం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో కలుగుతున్న సందేహాలను ఏకరవు పెట్టారు. పోస్టుమార్టం అనంతరం వివేకాది సహజమరణం కాదని తేలిపోయిందని, కానీ లెక్కలేనన్ని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఉదయం కనిపించని లేఖ సాయంత్రానికి ప్రత్యక్షం కావడం అర్థంకాని విషయం అన్నారు. కొందరు వ్యక్తులు ఈ వ్యవహారంలో కేసు పెట్టాల్సిన అవసరం లేదని అన్నట్టు తెలిసిందని సీఎం పేర్కొన్నారు. అంతదారుణంగా ఇంట్లోనే చంపడం అనేది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. చివరికి తనపైనా, లోకేశ్ పైనా ఆరోపణలు చేయడం మరీ దారుణమని, వివేకా మృతిని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
"మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీరు జస్టిఫై చేసుకోకుండా అందరిపై ఆరోపణలు చేయడం సరికాదు. శవాన్ని ఎవరు బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ కు తరలించారు? మళ్లీ బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ కు ఎవరు తరలించారు? వీటన్నింటికి సమాధానాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తాయి. బయటివాళ్లు చంపితే సాక్ష్యాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం జరిగింది. ఇంట్లో వాళ్లు చంపినప్పుడే ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. రక్తపు మరకలు ఎందుకు కడిగేయాల్సి వచ్చింది? మెదడు కూడా బయటికి వచ్చేలా గాయం అయితే గుండెపోటు అని ఎలా చెప్పగలిగారు? హార్ట్ అటాక్ అయితే తలలోంచి రక్తం వస్తుందా? ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ అంటున్నారు. నేరాలు చేయడంలో దిట్టలైన వాళ్లే ఇంత పకడ్బందీగా చేస్తారు" అంటూ విశ్లేషించారు చంద్రబాబు.