Jagan: చిన్నాన్న అంతటి సౌమ్యుడు మరెవరూ ఉండరు: జగన్ ఆవేదన
- అతి కిరాతకంగా చంపారు
- గొడ్డలితో ఐదు వేట్లు వేశారు
- అత్యంత నీచమైన చర్య అంటూ ఆక్రోశించిన జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఘాటుగా స్పందించారు. తన చిన్నాన్న అంతటి మంచి వ్యక్తి ఎవరూ ఉండరని, ఆయనలాంటి సౌమ్యుడు మరొకరు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఓ సీనియర్ రాజకీయవేత్తను అత్యంత దారుణంగా హతమార్చారని వ్యాఖ్యానించారు. ఓ మాజీ ఎంపీ ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి చంపడం అనేది అత్యంత దారుణమైన చర్యగా పేర్కొన్నారు జగన్. ఇది నీచమైన చర్య అని, ఘటన తీవ్రతను గుర్తించడంలో పోలీసుల వైఖరి చూస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో హత్య చేసినవాళ్లే సిట్ వేస్తే ఎలా న్యాయం జరుగుతుంది? అంటూ మండిపడ్డారు.