Andhra Pradesh: ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ డీజీపీని తప్పించండి: ఎన్నికల అధికారికి వైసీపీ నేత ఆళ్ల విజ్ఞప్తి
- ఠాకూర్ పై చర్యలు తీసుకోవాలి
- ఆయన ఉంటే ప్రజలు సజావుగా ఓటు వేయలేరు
- ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
మంగళగిరి శాసనభ్యుడు, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఠాకూర్ ను డీజీపీ విధుల నుంచి పక్కనబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఠాకూర్ పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పెండింగ్ లో ఉందని, అయినా ఆయనను డీజీపీగా కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆయనపై జీహెచ్ఎంసీ పార్క్ స్థలం ఆరోపణలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆళ్ల గుర్తుచేశారు. ఠాకూర్ డీజీపీగా విధుల్లో ఉంటే ప్రజలు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకునే పరిస్థితులు ఉండవని అన్నారు. కాగా, మంగళగిరి నుంచి ఏపీ మంత్రి నారా లోకేశ్ బరిలో దిగుతున్నట్టు తేలిన నేపథ్యంలో ఆళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.