Andhra Pradesh: 'ఐటీ గ్రిడ్స్' అశోక్ అరెస్ట్ తప్పదా?
- నోటీసులకు స్పందించని అశోక్
- లీగల్ గా ముందుకెళ్లాలని పోలీసుల ఆలోచన
- ఫిర్యాదీల వాంగ్మూలం తీసుకున్న అధికారులు
ఏపీ ఓటర్ల డేటా చౌర్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ (ఇండియా) లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ సిట్ అధికారులు రెండు దఫాలుగా నోటీసులు పంపినా అశోక్ నుంచి స్పందన కరవైంది.
మార్చి 2, 3 తేదీల్లో వరుసగా నోటీసులు పంపారు. మార్చి 13 బుధవారం విచారణకు రావాలంటూ కోరినా, అశోక్ హాజరు కాలేదు సరికదా... అతడి నుంచి బదులు కూడా రాలేదు. దాంతో, అశోక్ విషయంలో లీగల్ గా ముందుకెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అతడి అరెస్ట్ తథ్యమని తెలుస్తోంది. ఇక, డేటా చౌర్యం కేసులో ఫిర్యాదుదారులుగా ఉన్న లోకేశ్వర్ రెడ్డి, దశరథరామిరెడ్డిల వాంగ్మూలం తీసుకున్నారు సిట్ అధికారులు. బుధవారం గోషామహల్ లో ఉన్న సిట్ ఆఫీసుకు వచ్చిన ఆ ఇద్దరి నుంచి ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన కీలక వివరాలు తెలుసుకున్నారు.