Telugudesam: ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డేటా ప్రైవేటు సంస్థకు ఎలా లభ్యమైంది?: ఉండవల్లి సూటి ప్రశ్న
- టీడీపీ వ్యవహారశైలిని తప్పుబట్టిన మాజీ ఎంపీ
- ఇదే ఆఖరి ప్రెస్ మీట్
- పోలింగ్ పూర్తయ్యేవరకు మీడియా ముందుకు రానంటూ ప్రకటన
డేటా తస్కరణ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన డేటా ఓ ప్రైవేటు సంస్థ వద్దకు ఎలా చేరిందని ప్రశ్నించారు. అంతేకాకుండా, డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ ఆరోపణలు చేసినప్పుడు టీడీపీ స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు.ఎన్నికల స్థాయిని దిగజార్చేలా ఉందంటూ విమర్శించారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే అధికారికంగా డేటా బదిలీ చేసినా అది తప్పే అవుతుందని ఉండవల్లి స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం ఐటీ గ్రిడ్స్ వంటి సంస్థల చేతికి చిక్కడం టీడీపీ ప్రభుత్వ తప్పిదమేనని అన్నారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ పోలీసుల ముందుకు రాకుండా పరారీలో ఉండడం ఎందుకో అర్థం కావడంలేదని ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.