Chandrababu: జగన్ ఓ శాడిస్ట్.. అతడి స్టయిల్, అతడి బిహేవియర్ చూస్తే అలాగే ఉంటుంది: చంద్రబాబు
- ఎవర్నీ నమ్మడు
- ఆఖరికి తన నీడను కూడా నమ్మడు
- వైసీపీ అధ్యక్షుడిపై బాబు విసుర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఘంటా మురళి పార్టీలో చేరిక సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జగన్ ను ఏకిపారేశారు. జగన్ కరుడుగట్టిన నేరస్తుడు అని, నమ్మితే జైలుకు పంపుతాడని హెచ్చరించారు. గతంలో జగన్ తో పెట్టుబడులు పెట్టినవాళ్లందరూ జైల్లో అతనికి రూమ్మేట్లు, బెంచ్ మేట్లు అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ అసెంబ్లీకి వచ్చిందే లేదని, మన రాజధానిలో ఉండని వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం ఎందుకని ప్రశ్నించారు చంద్రబాబు.
"ప్రజలకు సేవ చేయాలని కాదు సీఎం అవ్వాలన్నది అతని కల. కనీసం పంచాయతీలో కూడా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నాడు. నేర్చుకోవాలన్న తపన కూడా లేదు. ఏదో నాలుగు రోజులు అసెంబ్లీకి వచ్చాడు. తన పార్టీకే చెందిన ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ఎక్కడ వాళ్లందరూ టీడీపీలో కలిసిపోతారేమోనని, అసెంబ్లీకి వెళ్లొద్దంటూ వాళ్లపై నిబంధనలు పెట్టాడు.
ఎవర్నీ నమ్మడు, అతడి నీడను కూడా అతడు నమ్మడు. అలాంటి వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. శాడిస్ట్ అంటే కరెక్ట్ గా ఉంటుంది. మీరు చూడండి, అతని స్టయిల్ కూడా అలాగే ఉంటుంది. అతడి బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. చిన్నాపెద్దా లేదు, వాళ్ల తండ్రితో సావాసం చేసిన నాతోనే ఇలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తులతో మాటలు పడాల్సిన పరిస్థితి వస్తోంది.
నేను ఒక్క పిలుపు ఇచ్చానంటే ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులతో వస్తాయి. జగన్ ఒక్క పిలుపు ఇస్తే కాలుపెట్టరు సరికదా పెట్టుబడి దారులు పారిపోయే పరిస్థితి ఉంది. ఆయనదొక పార్టీ..! దేశంలో వేలం పాట పెట్టి టికెట్లు అమ్ముకునే పార్టీ ఇదొక్కటే. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకే టికెట్లు.
జగన్ కు కేసీఆర్ తోడు, వీళ్లకి మోదీ సహకారం. ఫారం-7 ఇచ్చి ఓట్లు తీసేయమని చెబుతుంటాడు. బీహార్ నుంచి పీకే అనే వ్యక్తి వచ్చాడు. బీహార్ అడ్రస్ పెట్టుకుని ఇక్కడి వాళ్ల ఓట్లు తొలగిస్తుంటాడు. జగన్, కేసీఆర్ హైదరాబాద్ లో కూర్చుని కుట్రలు పన్నుతుంటారు. ఇలాంటి వాళ్లు వందమంది వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు" అంటూ ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబునాయుడు.