Tollywood: నాకు 50 ఓట్లు కూడా రావన్నావు కదా శివాజీ... ఇప్పుడేమంటావు?: నరేష్ చిద్విలాసం
- జీవితంలో ప్రెసిడెంట్ కాలేవన్నాడు
- 70 ఓట్ల మెజారిటీతో గెలిచాను
- నరేష్ విజయ దరహాసం
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నరేష్ కార్యవర్గం గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా వర్గం 'మా' ఎన్నికల్లో ఓటమిపాలైంది. అయితే తెరవెనుక జరిగిన కొన్ని వ్యవహారాలను, సంఘటనలను కొత్త అధ్యక్షుడు నరేష్ మీడియాకు వివరించారు. గతంలో శివాజీరాజాను మా అధ్యక్షుడిగా బరిలో దిగమని చెప్పింది తానేనని, ఆ తర్వాత మరోసారి కూడా ప్రోత్సాహం అందించానని అన్నారు.
అయితే కాలక్రమంలో ఎన్నో జరిగాయని చెబుతూ, నీకు 50 ఓట్లు కూడా రావని శివాజీరాజా అన్నాడని, కానీ నేడు 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందానని నరేష్ తెలిపారు. జీవితంలో నువ్వు అధ్యక్షుడివి కాలేవు అని వ్యాఖ్యానించిన శివాజీరాజాకు అధ్యక్షుడిగా గెలిచి చూపించానని అన్నారు. అయితే శివాజీరాజాపై తనకు ఎంతమాత్రం కోపంలేదని, అందరం కలిసి పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు నరేష్. ఎన్నికలకు ముందు ఎంతో మానసిక వేదనకు గురైనా ఈ విజయంతో అదంతా దూరమైందని ఆనందం వ్యక్తం చేశారు.