Tollywood: వాళ్లకు మమ్మల్ని అసిస్టెంట్లుగా పెడతారా?: కోట శ్రీనివాసరావు ఆవేదన

  • పనికిరాని పరభాషా నటులు అవసరమా?
  • వాళ్లకు లక్షలు లక్షలు ఇస్తున్నారు
  • మేం తీసిపోయామా!

టాలీవుడ్ నటుల్లో కోట శ్రీనివాసరావు విలక్షణమైన వ్యక్తి అని చెప్పాలి. ఆయన నటనలోనే కాదు మాటల్లో కూడా స్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. అది వివాదం అవుతుందో మరెటు దారితీస్తుందో అన్న సంశయం లేకుండా నిర్మొహమాటంగా మాట్లాడతారని కోటకు పేరుంది. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. కొత్త కార్యవర్గానికి ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... 1994 నుంచి తాను ఒకటే మాట చెబుతున్నానని, పరభాషా నటుల కంటే తెలుగు వాళ్లకే అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలన్నదే తన అభిమతం అని మరోసారి స్పష్టం చేశారు.

పాత్ర డిమాండ్ చేస్తే పక్క రాష్ట్రాల నుంచి నటులను తీసుకురావడంలో అర్థముంటుందని అన్నారు. కానీ ఎందుకూ పనికిరాని బి గ్రేడ్ ఫూల్స్ ని తీసుకువచ్చి వాళ్లకింద తమను అసిస్టెంట్లుగా పెట్టడం ఏం పద్ధతి? అంటూ ప్రశ్నించారు. ఇతర భాషల వారే కావాలనుకుంటే నానా పాటేకర్ రేంజ్ లో తీసుకురావాలని అభిప్రాయపడిన కోట... నటనే చాతకాని వాళ్లను తీసుకువచ్చి మెయిన్ రోల్స్ ఇచ్చి లక్షలకు లక్షలు ధారపోయడం ఎందుకు? అని అడిగారు. 'మా'కొత్త కార్యవర్గం ఈ అంశంపై దృష్టిపెట్టాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ఇదే కీలకమైన సమస్యగా ఉందని, దీన్ని పట్టించుకోకుండా అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ప్రకటనలు చేయడం వృథా అని పేర్కొన్నారు కోట శ్రీనివాసరావు.

  • Loading...

More Telugu News