Tollywood: నరేష్ చెప్పిన మాటలు నమ్మి ఇందులో దిగాను: రాజశేఖర్
- గౌరవ ఉపాధ్యక్షుడు అని చెప్పారు
- ఎన్నికల్లో నిలబడాలని చెప్పలేదు
- గెలుపు అనంతరం అందరినీ నవ్వించిన యాంగ్రీ యంగ్ మ్యాన్
టాలీవుడ్ లో ఎన్నికల సందడి ముగిసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం కోసం జరిగిన ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి 'మా' ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన హీరో రాజశేఖర్ మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. తనకు చాలా భయం అని, తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఊహించలేదని అన్నారు. మొదట నరేష్ తమ వద్దకు వచ్చి జీవితను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయాలని అడిగారని వెల్లడించారు.
"ఆ తర్వాత నరేష్ నా వద్దకు వచ్చి మీరు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పనిలేదన్నట్టుగా గౌరవ ఉపాధ్యక్ష పదవి అంటూ నమ్మకంగా చెప్పారు. ఆయన మాటలు నిజమే అని నమ్మి సరేనని చెప్పాను. తీరా చూస్తే ఎన్నికల్లో పోటీ! కానీ, ఆశ్చర్యకరంగా నేనే గెలిచాను. నాకు పోటీగా హీరో శ్రీకాంత్ ఉన్నారు. ఆయన మంచి క్రికెటర్, ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో పోటీపడి గెలవగలనా అనుకున్నాను. కానీ సభ్యులు నన్నే గెలిపించారు. టెన్షన్ తో ఇదైపోతున్న నాకు ఓటింగ్ ఫలితాలు ఎంత సంతోషాన్నిచ్చాయో మాటల్లో చెప్పలేను" అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు.