Andhra Pradesh: వైసీపీ నుంచి మాకు ఫిర్యాదు అందింది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడి
- తెలుగు రాష్ట్రాల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి
- ఏపీలో వైసీపీ నుంచి ఫిర్యాదు
- తగిన చర్యలుంటాయన్న సీఈసీ సునీల్ ఆరోరా
కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల వివరాలు బహిర్గతమైన నేపథ్యంలో తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. దీనిపైనా ఈసీ దృష్టిసారించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరమైన అంశాలపై కొన్ని ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో వైసీపీ నుంచి తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించారు. రాజకీయ పరమైన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించామని, ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అరోరా స్పష్టం చేశారు.