India: పోలింగ్ వేళ ఓటర్లకు ఈసీ కల్పిస్తున్న సదుపాయాలు ఇవే!
- ఐదు రోజుల ముందే పోలింగ్ స్లిప్పులు
- ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో మంచి నీరు, టాయిలెట్లు
- అదనంగా లక్ష పోలింగ్ కేంద్రాలు
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది.
ఏప్రిల్ 11న మొదలయ్యే పోలింగ్ మొత్తం ఏడు విడతల్లో జరగనుంది. మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలతో షెడ్యూల్ ముగుస్తుంది. ఇక ఈసారి ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. మండు వేసవిలో ఎన్నికలు జరగనుండడంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో విధంగా త్రాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పిస్తోంది. ఓటు వేసినట్టు తెలిపే రసీదు కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్లను అందుబాటులో ఉంచనున్నారు.
అంతేకాదు, దేశం మొత్తమ్మీద జరిగే ఎన్నికల తంతు కావడంతో ఆయా రాష్ట్రాల్లో విద్యార్థుల వార్షిక పరీక్షల వేళలు, రైతుల పంటకోత సమయాలు, వాతావరణ పరిస్థితులు... అన్నీ పరిశీలించి పోలింగ్ తేదీలను ఖరారు చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ఐదు రోజుల ముందుగానే ఓటర్ స్లిప్పులు అందజేయాలని నిర్ణయించారు.
అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అదనంగా లక్ష పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు వీలుగా 12 రకాల వ్యక్తిగత గుర్తింపు కార్డులతో కూడా ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. ఓటరు కార్డు లేకపోయినా ఇతర ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఐడెంటిటీ కార్డుల సాయంతో కూడా ఓటు వేయొచ్చని ఈసీ తన ప్రకటనలో తెలిపింది.