Tollywood: ఆ విషయంలో శివాజీరాజా నాకు నచ్చలేదు కాబట్టే నరేష్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నాను: నాగబాబు

  • ప్రెసిడెంట్ గా ఎప్పుడూ ఒకళ్లేనా!
  • శివాజీరాజా విషయంలో మెగాబ్రదర్ అసంతృప్తి
  • సమస్యలపై స్పందన తక్కువంటూ విమర్శ

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీరాజా ప్యానెల్ కు క్రమంగా మద్దతు తగ్గిపోతున్న తరుణంలో ఆశ్చర్యకరంగా నరేష్ ప్యానెల్ కు సపోర్ట్ చేస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, మెగాబ్రదర్ నాగబాబు కూడా నరేష్ వర్గానికే తన ఓటు అని స్పష్టం చేశారు.

నరేష్ ప్యానెల్ లో ప్రధాన కార్యదర్శిగా జీవిత, ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్ పోటీలో ఉన్నారు. మా అధ్యక్ష పదవి కోసం నరేష్ పోటీ చేస్తున్నారు. దీనిపై నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడిగా ఎవరైనా ఒక్క పర్యాయం పదవీబాధ్యతలు నిర్వర్తిస్తే చాలని, మరో పర్యాయం పోటీచేయడంలో అర్థంలేదని అన్నారు.

గతంలో తాను కూడా మా అధ్యక్షుడిగా వ్యవహరించానని, అయితే వరుసగా రెండోసారి కూడా పోటీ చేయమని కొందరు చెప్పారని, తాను మాత్రం అందుకు అంగీకరించలేదని చెప్పారు. మా అధ్యక్షుడిగా అనేక పర్యాయాలు పనిచేసే అవకాశం ఉండకూడదని నాగబాబు సూచించారు.

ఇదే సమయంలో తాను ఈసారి నరేష్ ప్యానెల్ కు మద్దతు ఇవ్వడానికి కారణాన్ని కూడా చెప్పారు. కొంతకాలంగా శివాజీరాజా నేతృత్వంలోని మా కార్యవర్గం చాలా నిస్సహాయ స్థితిలో కనిపిస్తోందని, ఎవరు పడితే వాళ్లు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా చూస్తూ ఉన్నారు తప్ప సరైన రీతిలో స్పందనే కరవైందని ఆరోపించారు. ఆ సమయంలో నరేష్, జీవిత మాత్రమే ధైర్యంగా మాట్లాడారని వివరించారు. అందుకే తన సపోర్ట్ నరేష్ వర్గానికి అంటూ స్పష్టత ఇచ్చారు.

  • Loading...

More Telugu News