Andhra Pradesh: మా పార్టీ సమాచారాన్ని కొట్టేసి మాపైనే కేసులు పెడతారా?: తెలంగాణ సర్కారుపై చంద్రబాబు నిప్పులు
- స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా ఐదేళ్లు అడ్డుకున్నారు
- దొంగతనం చేసి సమర్థించుకుంటున్నారు
- 160 మంది ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తారా?
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం నమ్మకద్రోహం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత ఐదేళ్లలో స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. ఏపీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఏపీలో మాత్రమే స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదయిందనీ, ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేశామని వెల్లడించారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ మాటలు చెప్పాడనీ, ఏపీలో మాత్రం గత ఐదేళ్లలో రైతుల ఆదాయం 123 శాతం పెరిగిందని తెలిపారు. అయితే ఈ ఆదాయం అన్నిప్రాంతాల్లో పెరగలేదనీ, అందుకోసమే రూ.73,000 కోట్లు ఖర్చుపెట్టి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ పథకం రిపోర్టును పారదర్శకంగా ప్రజల ముందు పెడుతున్నామన్నారు. అవినీతి తక్కువగా ఉండే మూడవ రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడుగడుగునా అడ్డుపడిందనీ, తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టవచ్చో అన్నిరకాలుగా పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని రెయిడ్ చేసి దొంగతనం చేసిన మీరు దాన్ని సమర్థించుకుంటారా? ఎంత దుర్మార్గం ఇది. మీరు చేసిందేమిటి? 160 మంది పనిచేస్తుంటే దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తారా మీరు? అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రజలను భయపెడుతున్నాయి. రాఫెల్ ఒప్పందంపై నిజాలను బయటపెట్టిన హిందూ సంస్థ ఎడిటర్ రామ్ పై కేసు పెడతామని బెదిరిస్తారా మీరు(కేంద్రం)? దేశంలో ఎక్కడా లేని విధంగా 20 ఏళ్లుగా కార్యకర్తలకు సంబంధించిన డేటాను సేకరించాం. ఒక్కో కార్యకర్తకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చేశాం. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి తిరిగి మా ప్రభుత్వంపై నే కేసులు పెడతారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.