Andhra Pradesh: తమకు ఓటేయని వ్యక్తులను చంద్రబాబు చంపిస్తాడు: జగన్ తీవ్ర వ్యాఖ్యలు
- ఓటేయని గ్రామాలను తగలబెట్టిస్తాడు
- ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులు వెళుతున్నారు
- అక్కడ ఏ పార్టీ బలంగా ఉందో వారి ద్వారా బాబు తెలుసుకుంటున్నారు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైసీపీ సమర శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమకు ఓటేయని వ్యక్తులను చంద్రబాబు చంపిస్తాడని, అలాగే, ఓటేయని గ్రామాలను తగలబెట్టిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులు వస్తున్నారని, ఏ పార్టీ బలంగా ఉందో వారి ద్వారా చంద్రబాబు తెలుసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభావితం చేయగల వైసీపీ నాయకులను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, బాబు ప్రలోభాలకు లొంగిపోవద్దని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తాడని, ఒక్కో ఓటర్ కు రూ.3 వేలు ఇచ్చి వారి ఓటును కొనుగోలు చేయాలని చూస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని జగన్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తుందని, ప్రజల బతుకులు బాగుపడతాయని జగన్ భరోసా ఇచ్చారు.