India: ఫిట్ నెస్ లేకుండా అభినందన్ కు బాధ్యతలు అప్పగిస్తే దేవుడు కూడా కాపాడలేడు: ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా

  • విమానం నడపాలంటే ఫిట్ నెస్ అవసరం
  • అభినందన్ ఫిట్ అయ్యేంతవరకు వేచిచూస్తాం
  • స్పష్టంగా చెప్పిన ఎయిర్ చీఫ్ మార్షల్

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ యుద్ధ విమానం నడపాలంటే కచ్చితంగా ఫిట్ నెస్ సాధించాల్సిన అవసరం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న అభినందన్ మొదట పూర్తిస్థాయి ఫిట్ నెస్ అందుకోవాలని, ఆ తర్వాతే యుద్ధ విమాన బాధ్యతలు అప్పగించే విషయం ఆలోచిస్తామని అన్నారు. కోయంబత్తూరు సమీపంలోని సూళూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సోమవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అభినందన్ కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని, అవసరం అనుకుంటే చికిత్స అందిస్తామని తెలిపారు.

"యుద్ధ విమానం నుంచి పారాచూట్ తో ఎజెక్ట్ అయిన పైలట్ కు వైద్య పరీక్షలు తప్పనిసరి. అభినందన్ కు ఎలాంటి వైద్య సహాయం అయినా తప్పక అందిస్తాం. ఒక్కసారి అతను పూర్తిస్థాయిలో సంసిద్ధమైతే విమానం కాక్ పిట్ ను అధిరోహిస్తాడు. ఓ విమానం నడపగలిగే సత్తాను సాధించగలిగితే అతడ్ని మళ్లీ స్క్వాడ్రన్ లో చేర్చుతాం. ఫిట్ నెస్ సాధించలేకపోతే, మళ్లీ ఫిట్ నెస్ సాధించిన తర్వాతే స్క్వాడ్రన్ లోకి తీసుకుంటాం.

విమానం నుంచి అత్యవసర పరిస్థితుల్లో దూకేయడం అంటే అది శరీరంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మీరు పూర్తి ఫిట్ నెస్ తో లేకుండా మరోసారి ఇలా దూకాల్సి వస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఫిట్ నెస్ లేకుండా విమానం నుంచి ఎజెక్ట్ అయితే మాత్రం శేష జీవితాన్ని వీల్ చెయిర్ లో గడపాల్సి ఉంటుంది. అందుకే అభినందన్ విషయంలో తొందరపడడం లేదు" అంటూ వింగ్ కమాండర్ అభినందన్ పై తమ వైఖరిని సుస్పష్టం చేశారు బీఎస్ ధనోవా. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే భారత వాయుసేన ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది.



  • Loading...

More Telugu News