India: 27 ఏళ్లలో 52 బదిలీలు.. ఎవరీ అశోక్ ఖేమ్కా?
- రాబర్ట్ వాద్రా భూ వ్యవహారంపై ప్రశ్నించిన ఐఏఎస్
- అవినీతిని సహించలేని నైజం
- నిజాయతీకి ప్రతిఫలంగా ట్రాన్స్ ఫర్లు!
పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయంటారు! మెండుగా నిజాయతీ ఉన్న ఈ ఐఏఎస్ అధికారి కూడా అనేక పర్యవసానాలు చవిచూశారు. తన 27 ఏళ్ల సర్వీసులో 52 ట్రాన్స్ ఫర్లు ఎదుర్కొన్నారు. ఆయన పేరు అశోక్ ఖేమ్కా. వయసు 53 సంవత్సరాలు. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అశోక్ ఖేమ్కా తాజాగా 52వ పర్యాయం బదిలీ అయ్యారు. ప్రస్తుతం హర్యానాలో క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఖేమ్కాను ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ ఫర్ చేసింది. ఆయన గతంలోనూ ఈ పదవిని నిర్వర్తించారు.
2012లో అశోక్ ఖేమ్కా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారాలకు సంబంధించి ఖేమ్కా తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య ఒప్పందాన్ని ఆయన రద్దు చేయడంతో ఖేమ్కా ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన హర్యానా క్రీడల విభాగంలో 15 నెలలు మాత్రమే పనిచేసినా తనదైన ముద్ర వేశారు. దాని ఫలితమే తాజా బదిలీ!