JC Diwakarreddy: చంద్రబాబు ఓ పెద్ద భ్రమలో ఉన్నారు... కల నెరవేరదు: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు
- అదేమంత సులువు కాదని అభిప్రాయపడ్డ జేసీ
- అజాగ్రత్తగా ఉంటే కలలు కల్లలేనని హెచ్చరిక
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను, తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని చంద్రబాబు భావిస్తున్నారని, అది కేవలం ఆయన భ్రమేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన కల కంటున్నారని, అదేమంత సులువుకాదని అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంటున్న కలలు కల్లలవుతాయని హెచ్చరించారు.
నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయని, చంద్రబాబు అనుకుంటున్నట్టుగా ప్రజల్లో సానుకూలత ఏమీ లేదని అన్నారు. ఎమ్మెల్యేలు తామే కలెక్టర్లం, ఎస్పీలం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరి ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిని మారిస్తేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని, అయితే, అంత ధైర్యం చంద్రబాబు చేయలేడని అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.