India: బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం క్షమించదు.. ‘పుల్వామా’లో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది!: ఒవైసీ

  • టీఆర్ఎస్ తో పొత్తుపై చాలామంది విమర్శించారు
  • ముస్లిం పార్టీగా ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో మాకు బాగా తెలుసు
  • ఐసిస్, జైషే అరాచకాలకు భారతీయ ముస్లింలు వ్యతిరేకం

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తమను చాలామంది విమర్శించారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. టీఆర్ఎస్ తొందర్లోనే బీజేపీతో కలిసిపోతుందని వీరంతా చెప్పారన్నారు. కానీ వారు చెప్పిన విషయాలేవీ జరగలేదని గుర్తుచేశారు. ఓ ముస్లిం పార్టీగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తమకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు చనిపోవడంపై ఒవైసీ సునిశిత విమర్శలు చేశారు. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం క్షమించదని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం పేరుతో జైషే మొహమ్మద్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) చేస్తున్న అరాచకాలకు భారతీయ ముస్లింలు అందరూ వ్యతిరేకమని తేల్చిచెప్పారు.

More Telugu News