Andhra Pradesh: ప్రజల మనోభావాలకు అనుగుణంగానే టికెట్లు ఇస్తాం.. క్రమశిక్షణ తప్పి గోల చేయవద్దు!: సీఎం చంద్రబాబు
- ఏపీలో భారీఎత్తున ఓట్ల తొలగింపునకు కుట్ర
- మోదీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువ
- టీడీపీలో ఇంకా చాలామంది చేరబోతున్నారు
డివిజన్ లేని మాయా జోన్ ప్రకటించి ఏదో త్యాగం చేసినట్లు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీలో పెద్దఎత్తున ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మోదీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువని ఎద్దేవా చేశారు. తన స్వార్థం కోసం మోదీ ఏకంగా దేశాన్ని కూడా పణంగా పెడతారని వ్యాఖ్యానించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
వైసీపీకి అవకాశమిస్తే దొంగ ఓట్ల పేరుతో ఎమ్మెల్యేల ఓట్లను కూడా తొలగించే ప్రయత్నిం చేస్తారని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ మనల్ని తిట్టడానికే విశాఖపట్నం వచ్చారన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటానని చెప్పే మోదీ జగన్ తో ఎలా జతకడతారని ప్రశ్నించారు. ఏపీ భవిష్యత్తును ఆకాంక్షించే వాళ్లంతా టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది టీడీపీలో చేరుతారని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలకు, మనోభావాలకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుందనీ, ఈ విషయంలో కార్యకర్తలు క్రమశిక్షణ తప్పి గోల చేయడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు సుతిమెత్తగా హెచ్చరించారు.