India: పుల్వామా దాడికి ఉపయోగించిన వాహనం ఎన్ని చేతులు మారిందో తెలుసా!
- జవాన్లపై దాడిలో కీలక సమాచారం రాబట్టిన ఎన్ఐఏ
- దాడికి ఉపయోగించిన కారు ఓనర్ గుర్తింపు
- నిందితుడి నివాసంపై దాడులు
పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక సమాచారం రాబట్టింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ఉపయోగించిన మారుతి ఈకో కారు ఎవరిదో ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. అనంతనాగ్ జిల్లాకు చెందిన సజ్జాద్ భట్ ను కారు యజమానిగా గుర్తించారు. సజ్జాద్ కూడా జైషే మహ్మద్ మిలిటెంట్ అని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
ఆయుధాలు ధరించిన సజ్జాద్ భట్ ఫొటోలు సోమవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దాడికి ఉపయోగించిన కారు యజమానిని గుర్తించడం పుల్వామా దాడిలో కీలక పురోగతి అని భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడిలో తునాతునకలైన కారు శకలాలను ఫోరెన్సిక్ విభాగం, ఆటోమొబైల్ నిపుణుల సాయంతో గుర్తించామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
మొదట ఈ కారును అనంతనాగ్ హెవెన్ కాలనీ వాసి మహ్మద్ జలీల్ అహ్మద్ హక్కానీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడని, అక్కడ్నించి అది ఏడుగురి చేతుల్లోకి మారిందని, చివరికి సజ్జాద్ భట్ వద్దకు చేరిందని అధికారులు వివరించారు. షోపియాన్ లోని సిరాజ్ ఉల్ ఉలూమ్ విద్యార్థి అయిన సజ్జాద్ భట్ ఫిబ్రవరి 4న ఈ కారును కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అనంతనాగ్ లోని భట్ నివాసంపై దాడులు నిర్వహించారు. అయితే ఆ సమయంలో భట్ తన నివాసంలో లేడని తెలుస్తోంది.