India: ఆస్కార్ ఉత్తమనటి ఒలీవియా కోల్మన్ మూలాలు భారత్ లోనే... ఆసక్తికర విషయం వెల్లడి!
- గతంలో బీహార్ వచ్చిన కోల్మన్
- పూర్వీకుల పుట్టిల్లుగా కిషన్ గంజ్ గుర్తింపు
- తన ముత్తవ్వ హ్యారియట్ స్థానికురాలట
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈసారి ఉత్తమనటిగా బ్రిటీష్ నటి ఒలీవియా కోల్మన్ ఆస్కార్ గెలుచుకుంది. ది ఫేవరెట్ చిత్రంలో అద్భుతమైన అభినయ ప్రదర్శన కనబర్చడంతో ఉత్తమనటి పురస్కారం కోల్మన్ ను వరించింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే... బ్రిటీష్ వనిత అయిన ఒలీవియా కోల్మన్ మూలాలు మాత్రం భారత్ లోనే ఉన్నాయి. తన ముత్తవ్వ హ్యారియట్ బీహార్ లోని కిషన్ గంజ్ వాసి అని స్వయంగా కోల్మన్ తెలిపింది. కోల్మన్ తన భారతీయ మూలాలను వెదుక్కుంటూ గతంలో భారత్ వచ్చింది. భారత్ రాకముందు తన పూర్వీకుల గురించి అంతా మిస్టరీగా ఉండేదని, 2018లో ప్రసారమైన హూ డూ యూ థింక్ యూ ఆర్? అనే బ్రిటీష్ డాక్యుమెంటరీ సిరీస్ లో వెల్లడించింది కోల్మన్. కొన్ని వందల సంవత్సరాల క్రితం తన కుటుంబం భారత్ లో జీవించింది అన్న భావన అద్భుతంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
తన భారత పర్యటనలో కిషన్ గంజ్ కు వచ్చిన కోల్మన్ మొదట అక్కడి పురాతన బ్రిటీష్ క్లబ్ ను సందర్శించింది. ఈ సందర్భంగా సుప్రసిద్ధ చరిత్రకారిణి అనురాధా ఛటర్జీతో కలిసి తన ముత్తవ్వ హ్యారియడ్ బేజెట్ గురించి అనేక వివరాలు తెలుసుకుంది. అనూరాధా ఛటర్జీ చూపించిన తన ముత్తవ్వ మ్యారేజ్ సర్టిఫికెట్ కోల్మన్ ముఖంలో వెలుగులు నింపింది. అయితే హ్యారియట్ డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ మాత్రం లభించలేదని అనూరాధ చెప్పడంతో కాస్తంత నిరాశకు గురైనా కనీసం మ్యారేజ్ సర్టిఫికెట్ అయినా ఉంది కదా? అని కోల్మన్ సంతృప్తి వ్యక్తం చేసింది.
తన అంచనా ప్రకారం హ్యారియట్ తల్లి బ్రిటీష్ మహిళ కాకుండా కిషన్ గంజ్ స్థానికురాలై ఉంటుందని అనురాధా ఛటర్జీ ఈ సందర్భంగా కోల్మన్ తో చెప్పిందట. అయితే మూణ్నాలుగేళ్ల వయసులో హ్యారియట్ తండ్రి చనిపోవడంతో ఆమెను బంధువులు ఇంగ్లాండ్ తీసుకెళ్లారట. అయితే 20 ఏళ్ల వయసులో తిరిగి కోల్ కతా వచ్చింది. అయితే ఆమె మొదటి పెళ్లి విషాదాంతం అయింది. భర్త చనిపోవడంతో చార్లెస్ యంగ్ బేజెట్ ను పెళ్లి చేసుకుని మిసెస్ బేజెట్ అయింది. ఈ విధంగా తన పూర్వీకుల గురించి డాక్యుమెంటరీ సిరీస్ లో అనేక వివరాలు పంచుకుంది ఒలీవియా కోల్మన్.