: చితక్కొట్టింది 'చిరు' గన్ మెన్లే: చెప్పకనే చెప్పిన సిటీ కమిషనర్
మెగా తనయుడు రామ్ చరణ్ వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వద్ద రామ్ చరణ్ కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ పై దాడి చేయించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దాడి వ్యవహారంలో పాల్గొన్న భద్రత సిబ్బంది చిరంజీవి గన్ మెన్లన్న విషయం బట్టబయలైంది. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పకనే చెప్పారు.
కేంద్ర మంత్రి చిరంజీవి భద్రత కోసం కేటాయించిన ఆ ఇద్దరు అంగరక్షకులు, రామ్ చరణ్ కు సెక్యూరిటీ సేవలు అందిస్తుండగా.. వివాదం నేపథ్యంలో వీరిద్దరినీ వెనక్కి పిలిపించినట్టు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. అంతేగాకుండా, వెస్ట్ జోన్ డీసీపీ సుధీర్ బాబుతో ఆ వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేయించనున్నట్టు కమిషనర్ తెలిపారు.
ఈ ఘటనలో ఐటీ ఉద్యోగులను చితకబాదినది తొలుత ప్రైవేటు భద్రత సిబ్బంది అని అందరూ భావించినా, కాదని ఇప్పుడు తేలిపోయింది. ఆ ఇద్దరు సాయుధులు రాష్ట్ర ఇంటలిజెన్స్ బ్యూరో అనుబంధ విభాగం ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ)కు చెందినవారని కమిషనర్ ప్రకటనతో రూఢీ అయింది.