India: భారత్ లోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ హై అలర్ట్
- విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కాల్
- భద్రత కట్టుదిట్టం చేసిన సీఐఎస్ఎఫ్
- అప్రమత్తం అయిన విమానయాన శాఖ
విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ముంబయిలోని ఎయిరిండియా ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ కు శనివారం ఫోన్ కాల్ వచ్చింది. తాము విమానాన్ని హైజాక్ చేసి పాకిస్థాన్ కు తీసుకెళతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
పుల్వామా దాడి అనంతరం అన్ని ప్రధాన ఎయిర్ పోర్టులలోనూ భద్రతను పెంచిన కేంద్రం తాజా బెదిరింపు కాల్ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ బలగాలతో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయాల లోపలే కాకుండా బయట కార్ పార్కింగ్ వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
వైమానిక టెర్మినల్స్, ఇతర కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సూచించింది. అంతేకాదు, ప్రతి విమానాశ్రయంలోనూ క్విక్ రియాక్షన్ టీమ్స్ (క్యూఆర్ టీ)లను మోహరిస్తున్నారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ బలగాలు అనుక్షణం పహరా కాస్తుండగా, తాజా బెదిరింపు కాల్ నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తున్నారు.
ఈ క్రమంలో బీసీఏఎస్ ప్రతి విమానాశ్రయానికి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యల జాబితాను పంపించింది. పుల్వామా దాడి సూత్రధారులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకారానికి దిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.