YSRCP: జగన్ ని అభినందించేందుకే వెళ్లాను: సినీ నటుడు నాగార్జున
- జగన్ మా కుటుంబానికి సన్నిహితుడు
- పాదయాత్ర పూర్తి చేసిన జగన్ ని అభినందించా
- అందుకే, జగన్ నివాసానికి వెళ్లింది
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో వైసీపీ అధినేత జగన్ ని ఈ రోజు సినీ నటుడు నాగార్జున కలవడంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. వైసీపీలో నాగార్జున చేరతారని, వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసేందుకు టికెట్ అడిగేందుకు వెళ్లారని... పలు వదంతులు వ్యాపించాయి.
దీనికితోడు, జగన్ ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడకుండా నాగార్జున వెళ్లిపోవడంతో ఈ ఊహాగానాలు మరింత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ, జగన్ తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇటీవల పాదయాత్ర పూర్తి చేసిన జగన్ ని కలిసి అభినందించేందుకు ఆయన నివాసానికి వెళ్లానని అన్నారు. అంతేతప్ప, ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలపై తనకు ప్రత్యేక ఆసక్తి లేదని నాగార్జున చెప్పారు.