Cricket: కేఎల్ రాహుల్ కు చివరి అవకాశం.. ఆసీస్ తో సిరీస్ కు టీమిండియా ఎంపిక!

  • టి20, వన్డే సిరీస్ జట్లలో స్థానం
  • కరుణించిన సెలక్టర్లు
  • ఫిబ్రవరి 24 నుంచి ఆసీస్ తో సిరీస్

ఎంతో ప్రతిభ ఉన్నా ఫామ్ లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ కు టీమిండియా సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. మరికొన్ని నెలల్లో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్ లకు ఈ కర్ణాటక బ్యాట్స్ మన్ ను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. బహుశా ఇది రాహుల్ కు వరల్డ్ కప్ ముంగిట చివరి అవకాశం అని చెప్పొచ్చు.

కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో మహిళలపై నోటికొచ్చినట్టు వాగిన కేఎల్ రాహుల్ దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో కలిసి ఎడాపెడా మాట్లాడిన రాహుల్ ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనలకు ఉద్వాసన ఎదుర్కొన్నాడు. దానికితోడు ఫామ్ లో లేకపోవడం కూడా రాహుల్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఈ నేపథ్యంలో... ఫిబ్రవరి 24 నుంచి భారత్ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు జట్టులో చోటు దక్కించుకోవడం అదృష్టమనే చెప్పాలి.

ప్రస్తుతం భారత జట్టుకున్న వనరుల దృష్ట్యా తుది 11 మందిలో ప్రతిస్థానానికి గట్టిపోటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ను 15 మందితో కూడిన టీమిండియాకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రపంచకప్ ముందు కోహ్లీ సేనకు ఇదే చివరి సన్నాహకం కావడంతో ఆసీస్ తో సిరీస్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు అన్ని బెర్తులు నిండిపోయినా, ఇందులో ఆటతీరు కూడా జట్టు ఎంపికలో ప్రామాణికం కానుంది.

More Telugu News