Chandrababu: మోదీ హోదా ఇవ్వకున్నా నైతిక విజయం మనదే: చంద్రబాబు

  • మనం ఏకాకులం కాదు
  • దేశం మొత్తం మనవెంటే ఉందని భరోసా వచ్చింది
  • ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్ర
  • దేశాన్ని దోచుకున్న దొంగలను విదేశాలకు పంపుతారు

దేశంలోని పార్టీలన్నీ వెంట ఉన్నాయనే భరోసా తమకు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన చేపట్టిన ధర్మ పోరాట దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మనం ఏకాకులం కాదని... దేశం మొత్తం మనవెంటే ఉందని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలియజేశామని అన్నారు. మోదీ హోదా ఇవ్వకున్నా తమదే నైతిక విజయమన్నారు. రేపు హోదా విషయమై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా వెళ్తామన్నారు.

మోదీని మించిన నటుడు దేశంలోనే లేడని ఆయన విమర్శించారు. గుజరాత్‌లో మతకల్లోలాలను రేపి.. శాంతి కోసమంటూ ప్రభుత్వ సొమ్ముతో దీక్షలు చేసిన చరిత్ర మోదీదని.. అలాంటి వ్యక్తి తమ దీక్షల గురించి ప్రశ్నిస్తారా? అంటూ మండిపడ్డారు. దేశాన్ని దోచుకున్న దొంగలను విదేశాలకు పంపుతారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం నుంచి లక్ష కోట్లు రావాల్సి ఉందని, అవి వచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తామన్నారు. ఉదయం దీక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రారంభమైందని.. దీక్ష ముగింపునకు మాజీ ప్రధాని దేవెగౌడ రావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చారని చంద్రబాబు కొనియాడారు.

More Telugu News